రెండు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్‌లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651 (74.70 శాతం).
తెలంగాణలో..
మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఈ దఫా మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.