అన్నమయ్య , ప్రభ న్యూస్: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో రూ.50 లక్షలకుపైగా విలువ చేసే ఒక కిలో బంగారు చోరీకి గురైంది. చిన్నమండెం ఎస్‌ఐ రామాంజనేయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని విఆర్ జువెలర్స్‌లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షాపులోకి చొరబడి, సుమారు కిలోకు పైగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు షాపు యజమాని నాగార్జునాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం రాయచోటి డీఎస్పీ శ్రీధర్, రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, ఎస్‌ఐ రామాంజనేయుడుతో కలిసి చోరీకి గురైన షాపును పరిశీలించారు.
వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందంచే ముమ్మరంగా తనిఖీలు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బంగారు షాపులోకి ఇద్దరు వ్యక్తులు మాస్కులు, తలపాగా వేసుకొని రాత్రి 3 గంటల ప్రాంతంలో షాపులోకి చొరబడి, గంటపాటు షాపులోనే ఉండి బంగారు ఆభరణాలు చోరీ చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. సీసీ ఫుటేజీ, క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మండల కేంద్రంలో ఒకసారిగా రూ.50 లక్షలకు పైగా విలువ చేసే బంగారు చోరీకి గురికావడంతో ప్రజల్లో, పలు ఇతర షాపుల యజమానుల్లో ఆందోళన నెలకొంది. రాత్రివేళల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.