విజయవాడ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఆంధ్రా క్రీడాకారుడు చలాది సతీష్ ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 7 నుండి 11 వరకు న్యూఢిల్లి వేదికగా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (WAKO) ఆధ్వర్యంలో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ 2024 పోటీలు జరుగనున్నాయి. ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణానికి చెందిన జాతీయ కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ చలాది సతీష్ ఎంపికయ్యాడు.
గోవాలో జరిగిన కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలలో సతీష్ (ఆంధ్రా) పురుషుల 74 కేజిల లైట్ కిక్ బాక్సింగ్ కేటగిరిలో ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఫైటర్ ఆలీ అజాజ్ని ఓడించి బంగారు పతకం సాధించి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. కాగా సతీష్ రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్ 2023-24లో చూపిన స్ఫూర్తికి సంతృప్తి చెందిన కర్ణాటక కిక్ బాక్సింగ్ అసోసియేషన్ టెక్నీకల్ కౌన్సిల్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఇండియాలు ఈ అంతర్జాతీయ పోటీకి సతీష్‌ని ఎంపిక చేశారు.
కాగా అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీకి ఎంపికైన చలాది సతీష్ మచిలీపట్టణంకి చెందినప్పటికీ అమెరికాకి చెందిన ”సెంట్రిక్ సాప్ట్ వేర్ కంపెనీ”లో ఉద్యోగ రీత్యా బెంగళూరులో వుంటూ ఇన్ట్సిట్యూట్ అఫ్ ఎయిట్ లింబ్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్‌కి చెందిన మాస్టర్స్ వినోద్ రెడ్డి, పునీత్ రెడ్డిల నేత్రుత్వంలో అద్భుతమైన శిక్షణ పొందుతున్నారు. వారిచ్చిన అమూల్యమైన శిక్షణ, మెళుకువలనే అనుభవమున్న వృత్తి క్రీడాకారులపై తలపడి జూనియర్ అయిన తాను జాతీయ చాంపియన్‌గా విజయం సాధించేందుకు తోడ్పాడ్డాయని, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ విదానంలో ప్రస్తుతం విజయవాడలో వుంటూ ప్రముఖ కిక్ బాక్సింగ్ కోచ్ మాస్టర్ హెమంత రెడ్డి వద్ద అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందుతున్నట్లు సతీష్ తెలిపారు. ఈ అంతర్జాతీయ పోటీలో తన ప్రతిభ చూపి విజయం సాధించి స్వంత రాష్ట్రము ఆంధ్రప్రదేశ్‌కి, అలాగే తాను శిక్షణ పొందుతున్న కర్ణాటకకు, తనకోచ్లకు పేరు ప్రాఖ్యాతులు తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని పేర్కొన్న సతీష్ దృఢ నిశ్చయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సాహించాలని పలువురు వివిధ క్రీడలకి చెందిన క్రీకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.