Wednesday, November 20, 2024

నంద్యాలలో ఖిలాడీ.. హోంగార్డు ముసుగులో అరాచకాలు, మహిళలపై లైంగిక వేధింపులు

నంద్యాల పట్టణంలో ఒక సీనియర్‌ హోంగార్డు ఖిలాడీ అవతారమెత్తాడు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వద్ద నెలనెల మామూళ్ల పేరిట దోచుకున్నది చాలక సహచర హోంగార్డుల వద్ద నుండి నెలనెలా వసూళ్లు చేయడం మొదలు పెట్టాడు. నంద్యాల పట్టణంలోనే ఉండాల్సిన సంబంధిత శాఖ అధికారి ఒకరు కర్నూలులోనే మకాం వేసి సదరు హోంగార్డుకు పెత్తనం ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. ముఖ్యంగా సదరు సహచర హోంగార్డులకు డ్యూటీలు వేసే విషయంలో పైసలు ముట్టజెప్పే వారికి ఒకలా, డబ్బులు ఇవ్వని వారికి మరోలా డ్యూటీలు వేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి రద్దీలేని చోటుతో పాటు ఆర్థికంగా కలిసివచ్చే ప్రాంతాల్లో డ్యూటీ వేయాలంటే మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. వీటికితోడు కొందరు మహిళ హోంగార్డులను సైతం లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. కొందరిపై అధికారుల వద్ద పలుకుబడి ఉందన్న కారణంతోనే కొందరు, బయటకు చెబితే తమకు ఇబ్బంది అవుతుందని మరికొందరు సదరు ఖిలాడిపై నోరు మెదపడం లేదు.

సదరు ఖిలాడీ హోంగార్డు వేషాలు అన్నీ ఇన్నీ కావు. సంబంధిత శాఖలోనే అరాచకాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడిన హోంగార్డు బయట మహిళల పట్ల కూడా వేధింపులకు పాల్పడ్డాడు. గత వారం నంద్యాల ఎన్‌జీఓ కాలనీకి చెందిన మహిళను లైంగికంగా వేధించడంతో ఆ మహిళ ఎదిరించి సదరు హోంగార్డు భాగోతాన్ని బయటకు ఈడ్చింది. పెద్దమనుషుల సమక్షంలో చెప్పుదెబ్బలు కొట్టడమే కాకుండా ఆ మహిళ కాళ్లను కూడా పట్టించినట్లు సమాచారం. సదరు మహిళ జోలికి ఎప్పుడు వెళ్లనని తన పరువుకు భంగం కలుగుతుందని బ్రతిమిలాడటంతో పంచాయతీ పెద్దలు హెచ్చరించి వదిలివేసినట్లు సమాచారం. సదరు ఖిలాడీ హోంగార్డుపై నంద్యాలలో పనిచేసే హోంగార్డులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు అతనిపై దృష్టి సారించి హోంగార్డులకు విధించే విధుల పట్ల వివిక్షత లేకుండా, డబ్బు ప్రమేయం లేకుండా చేయాలని కోరుతున్నారు. ఏదిఏమైనా కొందరు అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోంగార్డు తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement