Friday, November 22, 2024

ఖరీఫ్ ను ముంచిన అకాల వర్షాలు

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో నాలుగురోజులపాటు కురిసిన వర్షాలు జిల్లా లోని రైతాంగానికి తీరని వేదనను మిగిల్చాయి. ఖరీఫ్‌కు సంబందించి ముందుగా వేసిన రైతులు పంట కోతదశకు రావడంతో గత వారం కోతలు ప్రారంభించి యదా ప్రకారం పొలాల్లో కుప్పలుగా వేసారు.
శనివారం జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ముఖ్యంగా తొలి రెండు రోజులు తేలికపాటి వర్షం కురవగా పొలాల్లోని వరిపోగులు పూర్తిగా నీటమునిగాయి. దీంతో రైతులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

ముఖ్యంగా టెక్కలి డివిజన్‌ లో రైతులు భారీగా నష్టపోయారు. తోపాటు, పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లలో కూడా పంటను కోసి పొలాల్లో పోగులు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నట్లయింది. పలాస మండలంలో అత్య‌ధికంగా 14.4 సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, ఇచ్ఛాపురం, మందస మండలాలో 13సెం.మీ, కంచిలిలో 12, కవిటిలో 13, సోంపేట 10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో కూడా 4 నుండి 8 శాతం వర్షపాతం నమోదయ్యింది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ మొదటి నుండి రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తూ వచ్చింది. ప్రారంభంలోనే వర్షాభావ ప్రభావంతో మెట్ట ప్రాంతాల్లోని అనేక మంది వరి పంట వేయలేదు.

ఆ తరువాత కొంతమేర వర్షాలు కురవడంతో రైతులు ఎంతో ఆశగా కొన్ని మెట్ట ప్రాంతాల్లో ఖరీప్‌ పనులు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఆయకట్టు భూములపై కూడా కనిపించింది. అయితే మడ్డువలస, వంశధార, తోటపల్లి ప్రోజెక్టుల ద్వారా కొంతమేర సాగునీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు ఊపిరిపీల్చుకోగా, తరువాత వర్షాలు పడకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో నార్లు వేసిన రైతులు అవి ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం ఒకమాదిరిగా పంట పండింది. అయితే, అక్టోబర్‌ 26 నుండి 28 వరకూ గులాబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలు, వంశదార, నాగావళికి వచ్చిన వరదలు, అదే విధంగా సువర్ణముఖి, వేగావతి నదులు ఉప్పొంగి ప్రవహించి వంశధారలో చేరడంతో జిల్లాలో వేలాది ఎకరాల వరి భూములు నీటమునిగాయి. భారీ గాలుల ప్రభావంతో అరటి, చెరకు, బొప్పాయి పంటలు ద్వంసమయ్యాయి. వరి తోపాటు, ఇతర పంటలు వేసిన రైతులు కొంతమేర నష్టపోగా, ఈ రెండుమాసాలుగా పంటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులు కొంతమంది ఈనెల 1వ తేదీ నుండే కోతలు ప్రారంభించగా, మరికొంతమంది మరో రెండు రోజుల్లో కోసేం దుకు సిద్ధ‌మవుతుండగా, ఆలస్యంగా వేసిన రైతులు మరికొద్ది రోజుల్లో పంట కోసి పంట ఇంటికి తీసుకువెళదామని చూస్తున్న సమంలో అకాలవర్షాలు రైతులను నిట్టనిలువున ముంచాయి.

రేగిడి, పాలకొండ, బూర్జ, పలాస, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, సంతబొమ్మాళి తదితర మండలాల్లో కోతలు కోసి ఉంచిన వరిచేను పూర్తిగా దెబ్బతిన్న‌ట్టు రైతులు, అధికారులు కూడా తెలియజేస్తున్నారు. వరితోపాటు, ప త్తిపంట కూడా బాగా దెబ్బతిన్నట్లుగా పత్తి రైతులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ గాలులు వీచడం లేదని, లేకుంటే ఎన్ను విరిగి పూర్తిగా నీటమునిగేదని రైతులు వాపోతున్నారు. అయితే చీడపీడల కారణంగా ధాన్యం దెబ్బతింటుందన్న భయాన్ని కొందరు రైతులు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సెప్టెంబర్‌ చివర‌లో వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంటనష్టానికి సంబందించి అధికారులు ఆయా నివేదికలను ప్రభుత్వానికి పంపించగా, ఆ పరిహారం ప్రభుత్వం ఎప్పుడిస్తున్నదీ ఇప్పటికీ తెలియలేదు. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. అయితే, వర్షపునీరు పూర్తిగా తీసిన తరువాతగాని నష్టం ఎంతమేర ఉంటుందో చెప్పలేమని, రెండుమూడు రోజుల తరువాత సంబందిత అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఏదమైనప్పటికీ ఈ సంవత్సరం ఖరీప్‌ రైతాంగాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ఇదిలా ఉండగా భారీ వర్షాలు కారణంగా జిల్లా కేంద్రంలో పలు లోతట్టు కాలనీల్లో చేరిన వర్షపునీరు ఆదివారం కూడా తగ్గకపోవడంతో కాలనీల్లోని ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు.

మురుగు కాలువల్లోని నీటితో కలిసి వర్షపునీరు రోడ్లపై చేరిపోవడంతో ఎటువంటి వ్యాధులు వ్యాప్తిచెందుతాయోనన్న భయాన్ని కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జిల్లా కేంద్రలోని ఆర్టీసి కాంప్లెక్స్‌లో ఆదివారం కూడా వర్షపునీటిలో ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఈ కాంప్లెక్స్‌లో కూడా పారిశుద్ధ్య‌ పరిస్థితులు అద్వాన్నంగా ఉండడంతో నీటిలో నడిచిన ప్పుడు ఎటువంటి రోగాలు వస్తాయోనని ప్రయాణీకులు ఆం దోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తేనే ఈ కాంప్లెక్స్‌లో మోకాళ్లలోతు నీరు చేరిపోతుందని, దాదాపు రెండున్నదర దశాబ్దాలుగా ఈ పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ దీనిని సరిది ద్దేందుకు ఇటు అర్టీసి అధికారులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎటువంటి కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement