Monday, October 21, 2024

Khaki Power – ఫ్యాక్ష‌న్ ఏరియాలో ఆపరేషన్ సైలెన్స్ … గడగడలాడిస్తున్న లేడీ ఐపిఎస్ లు


రౌడీ లీడ‌ర్ల ఓవ‌ర్ యాక్ష‌న్‌కి చెక్‌
ఇద్దరు లేడీ ఐపీఎస్ ఆఫీసర్ల పక్కాప్లాన్
రౌడీ షీటర్లకు.. పొలిటీషియన్లకు వార్నింగ్
ఫ్యాక్షన్ గడ్డమీద‌ జింతాత జితాజితా
ఇప్పటికే అనంతలో మౌనరాగం
తాడిపత్రి సహా ఫ్యాక్షన్ గ్రామాల్లో సైలెన్స్‌
ఓవ‌ర్ యాక్ష‌న్ చేసే లీడ‌ర్ల‌కు చెక్
పల్నాడు పల్లెల్లో అంతా గప్ గప్
మాచర్ల, నర్సారావుపేటల్లో పోలీసుల నజర్
పోలీసు కోవర్టులూ.. కట్టప్పలకూ కళ్లెం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – పెత్తందారితనం, అరాచకత్వం జత కలిస్తే.. అదే ఫ్యాక్షనిజం. ప్రశాంత జీవనంపై గొడ్డలి వేటు. ప్రశ్నించే గొంతు కుత్తుక నరికే వేట కొడవ‌లి.. అటు బాంబుల మోత.. ఇటు గృహదహన విన్యాసం. తరతరాలుగా పల్లె జనం హక్కుల్ని చిదిమేస్తున్న అహంకార అరాచక సమాంతర రాజ్యాన్ని ఏలుతున్న ఫ్యాక్షనిజం ఇలాఖాల్లో తాజాగా ఆపరేషన్ నారీ భేరీ ఆరంభమైంది. అనంతపురం, పల్నాడు జిల్లాల్లో అరాచక శక్తులను ధనుమాడే క్రతువు బాధ్యతలను ఇద్దరు మహిళ ఐసీఎస్ ఆఫీస‌ర్లు చేపట్టారు. జూన్ 4వ తేదీన విజయభేరీ మోగించేందుకు సర్వసన్నద్ధమయ్యారు. అటు గౌతమీ ఉగ్రాగ్రహం.. ఇటు మలిక గర్జనతో.. ఫ్యాక్షన్ గడ్డపై అయిగిరి నందిని నందిత మోదినులయ్యారు. అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే ఫ్యాక్షనిస్టులు పరారీలో ఉన్నారు. సమస్యాత్మక గ్రామాలన్నీ పోలీసుల ఆధీనంలోకి చేరుకున్నాయి. ఘర్షణలకు తావులేని రీతిలో అధికారులు ఎక్కడిక్కడ కట్టడి చేశారు. కౌంటింగ్ రోజున ప్రశాంత వాతావరణం.. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఇద్దరు లేడీ ఐపీఎస్ అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.

- Advertisement -

గౌతమి శౌర్యం..

గౌతమి శాలి.. ఆమె పేరు వినిపిస్తే చాలు.. తాడిపత్రి వణికిపోతోంది. ఏపీలో పోలింగ్ వేళ తాడిపత్రిలో ఫ్యాక్షన్ ఉన్మాదం పడగ విప్పింది. గంగవెర్రులెత్తింది. తన్నులాట.. నరుకుళ్లు.. వేటాడ‌టం తాండవించింది. ఒక రకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. ముఖ్యంగా తాడిపత్రిలో అరాచకం చెలరేగిపోయింది. అంతే ఎన్నికల కమిషన్ చలించిపోయింది. అప్పటి ఎస్పీని మర్యాదగా సాగనంపింది. ఆ స్థానంలో కొత్త ఎస్పీగా గౌతమి శాలికి బాధ్యతలు అప్పగించింది. అంతే మేడమ్ అడుగుపెట్టగానే సీన్ మారిపోయింది. ఘర్షణలకు తొడలు కొట్టే రౌడీ షీటర్లు.. మీసాలు తిప్పేరాజకీయ నాయకుల నోళ్లకు తాళాలుపడ్డాయి. ఇక ఇప్పటి వరకూ అధికార పక్షానికి బంట్రోతులుగా.. వత్తాసు పలికినోళ్లంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఫలానా ఠాణాలో పోలీసు కానీ.. ఉన్నతాధికారి గానీ రాజకీయ నేతలకు కొమ్ముకాసినట్టు తెలిస్తే చాలు, నిజనిర్ధారణతో ఎస్పీ గౌతమి వెంట‌నే రెస్పాండ్ అవుతున్నారు. గంటల వ్యవధిలోనే అత్తారింటికి దారి చూపిస్తున్నారు.

అక్రమార్కులకు అరదండాలే..

గౌతమి శాలి అనంతపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత‌ పోలీసు శాఖలో కోవర్టులను, కట్టప్పలను గుర్తించే యజ్ఞం చేపట్టారు. నిజం తేలితే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే.. అధికార పక్షం కొత్వాల్‌గా వ్యవహరించిన అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌పై దృష్టి సారించారు. జాకీర్ హుస్సేన్ పదేళ్లకు పైగా అనంతపురంలోని పలు పోలీస్ స్టేషన్‌‌లలో విధులు నిర్వహించారు. అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.

తీగలాగారు.. డొంక కదిలింది

జాకీర్ హుస్సేన్‌ అంటే వసూళ్ల మారాజని మరో పేరు అనంతలో షికార్లు చేస్తుంటుంది. టూ టౌన్ సీఐగా పనిచేస్తున్నప్పుడు కర్నాటకలోని బళ్లారికి చెందిన ఆర్యవైశ్య వృద్ధులను బెదిరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కూడా పోలీస్ హైకమాండ్‌కు తెలియడంపై అతనిపై చర్యలకు ఆదేశించారు. బళ్లారికి చెందిన ఆర్యవైశ్యుల భూమిని కబ్జా చేయడానికి యత్నించిన ఓ వైసీపీ నేతకు.. జాకీర్ కొమ్ము కాసారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల ఒత్తిడితో భూ యజమానుల బంధువులపై అక్రమ కేసులు పెట్టినట్లు ఎస్పీ గౌతమిశాలికి బళ్లారికి చెందిన సత్యనారాయణ శెట్టి ఫిర్యాదు చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఆయనపై ఆరోపణలు, చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. ఇక కఠిన చర్యలకు రెడీ అయ్యారు. అంతే జాకీర్‌ను రాష్ట్ర పోలీసు డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు.

ఫ్యాక్షన్ ఇలాఖాలో మలికా గర్జన..

పల్నాడు.. అదో ఫ్యాక్షన్ గడ్డ.. క‌త్తి ప‌డితేనే అక్కడ మ‌నుగడ‌.. రాజకీయ పరదాలో పెత్తందారుల అరాచక పర్వానికి వేదిక. హింసకు అడ్డులేదు. అదుపులేదు. అదే నిత్యకృత్యం. ఇక ఎన్నిక‌లొస్తే కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులు పెట్రోల్ బాంబులు, నాటు బాంబులతో నరమేధం తప్పదు. ఈ ఎన్నిక‌ల్లోనూ పల్నాడులో ఫ్యాక్షనిజం తన పడగను విప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. పల్నాడులో శాంతి భద్రతలను కాపాడి, అల్లర్లను నియంత్రించటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం వైఫల్యం అయ్యింది. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్‌ జిల్లా ఎస్పీబిందుమాధ‌విపై వేటు వేసింది. వాస్తవానికి బిందుమాధ‌వి క‌ఠిన చ‌ర్యలు తీసుకున్నా.. కింద స్థాయి కోవర్డు సిబ్బంది ఎస్పీ ఆదేశాలను పాటించ‌లేదు. ఘ‌ర్షణ‌ల‌ విష‌యంలో త‌ప్పుడు స‌మాచారంతో ఆమెఫెయిలయ్యారు. ఈ విపత్కర స్థితిలో మలికా గ‌ర్గ్‌ను ఎన్నికల కమిషన్ ఎస్పీగా నియ‌మించింది.

పల్నాడులో జింతాత జితాజితా..

ఎస్పీగా వచ్చీరావడంతోనే మలికా గ‌ర్గ్‌ తన ఆపరేషన్ షురూ చేశారు. పల్నాడులో శాంతిభద్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజునే రౌడీషీటర్లను ఎస్పీ కార్యాల‌యానికి పిలిపించారు. హ‌ద్దు మీరితే తాట తీస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లను వరుసగా క్యూలో నిలబెట్టి సూటిగా కళ్లలోనే చూస్తూ చెప్పాల్సినది చెప్పేశారు. తమ ప్రవర్తన మార్చుకోవాలని, పాత పద్ధతుల్లోనే కొనసాగితే ఇక జింతాత జితాజితా తప్పదని హెచ్చరించారు. ప‌ల్నాడు ఫ్యాక్షన్ గ్రామాల‌పై దృష్టి సారించారు. రాజకీయ పార్టీల‌తో తారతమ్యం లేకుండా నేత‌లంద‌రి ఇళ్లల‌లోనూ త‌నిఖీలు చేయించారు. ఈ త‌నిఖీల్లో గుట్టలుగుట్టలుగా దొరికిన పెట్రో, నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నేత‌లంద‌రి పైనా కేసులు న‌మోదు చేశారు. గ్రామంలో బాంబు పెలితే బాక్స్ బ‌ద్దల‌వుతుందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. అంతే .. చాలామంది ప్యాక్షనిస్టులు గ్రామాలు వ‌దిలి పారిపోయారు. ఎన్నికల సంద‌ర్భంగా బైండోవ‌ర్ కేసుల‌ను ప‌రిశీలించి వారిని పిలిపించి ఇక‌పై ఘ‌ర్షణ‌లు జ‌రిగితే జైలు జీవితం తప్పదని త‌నదైన‌ స్టైల్‌లో మ‌లికా హెచ్చరించారు.

మాట విన‌ని సిబ్బందికీ వాతలే..

ఇదే స‌మయంలో త‌నకు ముందు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన బిందుమాధ‌వి ఆదేశాలు పాటించ‌ని, దిక్కరించి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన పోలీస్ కోవర్టులపై ఇంట‌ర్నల్ దర్యాపున‌కు ఆదేశాలు ఇచ్చారు.. ద‌ర్యాపు నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ సెల‌వులో ఉండాల్సేదేనని ఇంటికి పంపేశారు. ఇక స్టేష‌న్ల వారీగా సిబ్బందితో స‌మీక్ష నిర్వహించి ఘ‌ర్షణ‌లు జ‌రిగితే స్టేష‌న్‌ హౌజ్ ఆపీస‌ర్ దే బాధ్యత అంటూ తేల్చి చెప్పారు. ప‌ల్నాడు ప్యాక్షన్ విలేజీలుగా గుర్తించిన 86 గ్రామాల్లో 144 సెక్షన్ నిషేదాజ్ఞలు విధించారు. ప్రతి గ్రామంలోనూ పికెట్ ఏర్పాటు చేయించారు. ఈ చ‌ర్యల‌తో ప్రస్తుతం ప‌ల్నాడు ఎప్పుడూ లేనంగా ప్రశాంతంగా ఉంది.

ప్రశాంత కౌంటింగే వీరిద్దరి లక్ష్యం..

ఇటు అనంతపురం జిల్లాలో.. అటు పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలలే లక్ష్యంగా లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు కంకణం కట్టుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో చీమ చిటుక్కుమనటం లేదు. కౌంటింగ్ రోజు కూడా ఇదీ సైలెన్స్‌ కొనసాగించటానికి చర్యలు చేపట్టారు. ఘర్షణకు దిగే వ్యక్తులకు కళ్లెం వేశారు. ఇద్దరు అధికారులు తమ జిల్లాలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు శాంతిభద్రతలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయ‌ని హెచ్చరించారు. పోలీసు అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే ఎంత‌టివారైనా చర్యలు తప్పవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement