ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు..
ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. ఎస్పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన కొత్త పరిశ్రమలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్-1955 చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్.. ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్-1994లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణ, ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్-2021 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్..ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. తాడేపల్లి మండలంలో హరేకృష్ణ ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమిని లీజు పద్దతిలో కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital