Tuesday, November 26, 2024

మృత్యువుతో నాలుగు గంట‌లు కీర్త‌న పోరాటం….చివ‌ర‌కు..

రావుల‌పాలెం – చుట్టూ నిశ్శబ్దం.. కళ్లు చించుకున్నా కానరాని చీకటి.. కింద నది. ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా నీరుగారిపోతారు. కానీ, 13 ఏళ్ల అమ్మాయి ధైర్యం చూపింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసిని (36) భర్తతో విభేదాలతో విడిపోయింది. కూలిపనులు చేసుకుంటూ కుమార్తె కీర్తన(13)తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్‌తో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. వీరికి ఏడాది వయసున్న జెర్సీ జన్మించింది. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వదిలించుకోవాలని పథకం రచించాడు…

కొత్త బట్టలు కొందామని నమ్మించి శనివారం సాయంత్రం కారులో ముగ్గురినీ తీసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని వారిని నమ్మించి కిందికి దింపాడు. ఆపై రెయిలింగ్ వద్దకు తీసుకెళ్లి అందరినీ ఒక్కసారిగా కిందికి తోసేశాడు. సుహాసిని, జెర్సీ నదిలో పడిపోగా కీర్తనకు మాత్రం బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపు చేతికి చిక్కింది. చేతులతో దానిని గట్టిగా పట్టుకుంది. కాపాడాలంటూ కేకలు వేసింది. కానీ, ఆ చీకటిలో ఆమె ఆర్తనాదాలు గాలిలో కలిసిపోయాయి. చుట్టూ చీకటి, జనసంచారం లేదు. అయినా భయపడిపోలేదు. ఈ క్రమంలో తన జేబులో సెల్‌ఫోన్ ఉన్న విషయం గుర్తొంచింది.
ఒక చేత్తో పైపును గట్టిగా పట్టుకుని మరో చేత్తో దానిని తీసి పోలీస్ కంట్రోల్ రూము నంబరు 100కు ఫోన్ చేసింది. పరిస్థితి చెప్పింది. రావులపాలెం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైపునకు వేలాడుతున్న బాలికను రక్షించారు. దాదాపు నాలుగు గంట‌ల‌ పాటు చిమ్మచీకట్లో పైపుకు వేలాడుతూనే, మరో చేత్తో ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసిన వైనం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. బాలిక ధైర్యానికి ఫిదా అయిపోయారు. గోదావరి నదిలో గల్లంతైన ఆమె తల్లి, చెల్లెలు కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నిందితుడు సురేశ్ కోసం వేట ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement