ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలి ముసునూరు సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, ఒక బస్సు ఢీ కొట్టుకున్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 20 మందికి పైగానే గాయపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది… దీంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు.. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి యుద్ధ ప్రాతిపదికపై తరలించారు. అలాగే బాధితులకు ఎక్స్ గ్రేషియా అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా ఎస్పీ ఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితులను పరీశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారన్నారు.