Friday, November 22, 2024

Kartikam – శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు …

కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా ఎపి , తెలంగాణ రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. వేముల‌వాడ‌, శ్రీశైలం, అమ‌రావ‌తి, ద్రాక్షారామంతో పాటు ప్రధానాలయాలకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేముల‌వాడ ….

వేములవాడతోపాటు ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో కార్తిక దీపాలను వెలిగించారు. దీంతో ఎములాడ రాజన్న దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పడుతున్నది. ఇక ఇక భద్రాచలంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు. వాటిని నదిలో వదిలారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఎపిలోని కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేశారు. దీంతో విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద రద్దీ నెలకొంది. రాజమహేంద్రవరం, భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీపాలను వెలిగించి నదుల్లో వదిలారు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నదిలోకి కార్తీక దీపాలు వదిలిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

చివరి రోజుతో పాటు చివ‌రి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు.

- Advertisement -

తిరుపతిలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపారాధన చేశారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పంచారామాల‌లో పోటెత్తిన భ‌క్త జ‌నం

కార్తీక మాసం ఆఖరి సోమవారం పంచారామాలు భ‌క్తుల‌తో పోటెత్తాయి.. గోదావరి ఘాట్‌లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement