ఏలూరు బ్యూరో ప్రభ న్యూస్ – మీసాల బాపిరాజు, చిరునవ్వులే అతడి ఆయుధం. ఆత్మీయ పలకరింపే అతడి అస్ర్తం. జనంలో జనంగా.. నాయకుల్లో అధినాయకుడిగా సుదీర్ఘ రాజకీయ యాత్రలో అలుపెరుగని కాంగ్రెస్ నేత కనుమూరి బాపిరాజు మళ్ళీ రాజకీయాల్లో తెరపై పత్యక్షమవుతున్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి బాపిరాజును కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాంగ్రెస్ పార్టీలో ఐదు సార్లు శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పశ్చిమగోదావరి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించటమే కాదు.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆకర్షణీయ నాయకుడిగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత బాపిరాజు రాజకీయాల్లో స్థబ్దతగా ఉన్నారు.
షర్మిల రెడ్డి రాకతో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలను రంగంలోకి దించటంతో.. కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఇందులో భాగంగానే ఆకర్షణీయ నాయకుడు రాజకీయ భీష్మాచార్యుడు కనుమూరి బాపిరాజును రంగంలో దించింది. ఈ మేరకు ఈ సమాచారాన్ని ఆ పార్టీ వర్గాలు మహానందభరితులై బాపిరాజు రాకపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ బాపిరాజులకు అత్యంత సన్నిహితం ఉంది. ప్రతి అధినాయకుడిని ఆకర్షించటంలో దిట్ట. తాజాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ బాటలోకి రావటంతో… ఆయన పాత రోజులు గుర్తు చేసుకుని.. కాంగ్రెస్ పార్టీలో పునర్వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో.. వయసు మీద పడినా.. లెక్క చేయక రాజకీయాల్లో మళ్లీ తన ముద్ర వేసేందుకు బాపిరాజు సన్నద్ధమవుతున్నారని కాంగ్రెస్లో ఆయన అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.
పొలిటికల్ పేజీల్లో హాఫ్ సెంచరీకి మరో నాలుగేళ్లే
1977లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన బాపిరాజు కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలతో కాంగ్రెస్ పార్టీలో సేవలందించారు. ఏడాది కాలంలోనే బాపిరాజుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంతే 1978లో బాపిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. 1981లో కొల్లేరు సరస్సు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ చరిష్మాలో తెలుగుదేశం పార్టీ ప్రభజనంలోనూ 1985 లో జరిగిన ఎన్నికల్లోను, 1989 లోను బాపిరాజు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాను చాటుకున్నారు. 1994లో 1997లోను తిరిగి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు 1998లో తొలిసారిగా లోక్ సభకు బాపిరాజు ఎన్నికయ్యారు. 2007లో ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ మినిస్టర్ గా పని చేశారు 2009లో తిరిగి రెండోసారి లోక్ సభ కి ఎన్నిక య్యారు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్తతలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ భీమవరంలో వేద పాఠశాల ఏర్పాటు చేశారు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే పార్టీలో ప్రారంభం నుంచి నేటి వరకు కొనసాగుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఇన్ని పదవులు నిర్వహించిన నాయకుడు మరొకరు లేరని చెప్పాలి.
జనాకర్షణలో,, స్పెషలిస్ట్
ప్రజాధరణ కలిగిన నాయకులుగా పార్టీలో క్రమశిక్షణ గల నేతగా వేషం భాష వ్యవహార శైలితో తనదైన ప్రత్యేక ముద్రగలిగి ప్రజలకు అత్యంత సన్నిహితుడై హాస్యోక్తులతో ఆకట్టుకోగలిగిన మీసాల బాపిరాజు ఏడుపదులు పైబడిన వయసులో 17 ఏళ్ల యువకుడిలా రంగంలోకి దిగడం రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. .ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలలో చక్రం తిప్పుతున్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ బాపిరాజుకు సమీప బంధువులు కావడం కొసమెరుపు. బాపిరాజు రాకతో పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త మలుపు తప్పదనేది రాజకీయ వర్గాల వాదన.