కనిగిరి – రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వవైభవం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. ఏపీలో రాక్షస పాలన పోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు.
గతంలో తాము యువతకు ఉద్యోగాలు ఇస్తే, జగన్ మాత్రం గంజాయి సప్లై చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని అంతా సంకల్పం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆరోజు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని పిలుపునిస్తే జనం ఒక ప్రభంజనమై కదిలిందని, ఈరోజు రా కదలిరా అంటూ మీ అందరి సహకారం అడుగుతున్నానని పేర్కొన్నారు.
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిస్తున్నానన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు . తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమిష్టి బాధ్యత అన్నారు. సైకో పోయి సైకిల్ అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సర్వేల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. నాయకుడు చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలి చేయడం దేనికంటూ ప్రశ్నించారు. జగన్ చర్యల వల్ల కొందరు నేతలు పోటీ చేసేందుకు కూడా భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రా కదలిరా కార్యక్రమాన్ని పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి ప్రారంభించామని పేర్కొన్న ఆయన కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్ అని గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు అన్నారు. న్ హయాంలో ఏపీ 30ఏళ్ళు వెనక్కు వెళ్ళిందన్నారు.
సంక్షేమ పథకాల పేరుతో మీకు ఇచ్చేది పది రూపాయలు అయితే దోచుకునేది వంద రూపాయలు అని ప్రజలు ఇది గమనించాలన్నారు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి వారి ఆదాయాన్ని జీవన ప్రమాణాలను పెంచాలని, కానీ రాష్ట్రంలో ఎక్కడ సుపరిపాలన కనిపించడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు
ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష
కనిగిరి సభ అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టీడీపీ అధినేత చద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిచారు.