- ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
- ఇక్కడి ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటా
- రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా…నేను మీ వాడినే
- మీ ఆదరణ, అభిమానమే నాలుగు సార్లు సిఎం చేసింది
- ఇక్కడి బిడ్డగా మీ రుణాన్ని తీర్చుకుంటా
- ‘స్వర్ణ కుప్పం- విజన్ 2029’ డాక్యుమెంట్ ను విడుదల చేసిన చంద్రబాబు
కుప్పం : తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి నైనా.. అ స్థాయికి చేర్చింది మీరేనంటూ కుప్పం ప్రజలకు సిఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.. నాలుగుసార్లు ముఖ్యమంత్రి చేసిన అభిమానం, ఆదరణ మీదే నంటూ ప్రశంసలు కురిపించారు. కుప్పంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని, పసుపు జెండాకు పెట్టని కోట అని అన్నారు. రెండు రోజుల పాటు పర్యటన కోసం నేటి ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్రవిడ యూనివర్సిటీలో ‘స్వర్ణ కుప్పం- విజన్ 2029’ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… వైసిపి హయాంలో రాష్ట్రం వెనుకబడిందని.. అప్పుల కుప్పగా స్టేట్ మారిందన్నారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. 2014-19 మధ్య ఏపీని అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు.. ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని చెప్పారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… “రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించాం. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలనేదానిపై ఆలోచన చేశాం. కుప్పానికి పెట్టుబడుడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదు. ఒకసారి అవకాశం వస్తుంది.. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే | వైకుంఠపాళి తరహా పరిస్థితే ఎదురవుతుంది. రాజకీయం, వ్యాపారం సహా అన్ని రంగాలకూ ఇది వర్తిస్తుంది. ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ తయారు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండివారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే.. అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు.
టిడిపి ఆవిర్భావం తర్వాత కుప్పంలో తెదేపా తప్ప వేరే పార్టీ జెండా ఎగరలేదు. పోటీ చేసిన అన్ని సార్లూ ప్రజలు గెలిపించారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చ జరగాలి. ఉద్యోగాలు చేయడమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలి” అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు ఘన స్వాగతం ..
రెండు రోజుల పర్యటన కోసం గుడుపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరా గాంధీ స్టేడియంకు హెలికాప్టర్ లో చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అనంత పురం రేయింజ్ డి ఐ జి.షి మోషీ, ఎస్పీ మణికంఠ చెందొలు,జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, కడ పీడీ వికాస్ మర్మత్,డి ఎఫ్ ఓ.భరణి ముఖ్యమంత్రి కి స్వాగతం పలికారు.