కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు సమాచారం..
చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం విచక్షణరహితంగా కత్తులతో దాడి చేసింది.
ఈ దాడిలో బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజులు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటనా స్థలంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
శలపాక గ్రామంలో తదుపరి ఘర్షణలు జరగకుండా కాకినాడ సర్కిల్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లు చేశారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కాకినాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంఘటనా స్థలంకు వద్దకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.