కాకినాడ: కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ . ఈ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోర్ట్ అధికారులపైనా, డిఎస్పీ పైనా ఫైర్ అయ్యారు.. ఇటీవల బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో కాకినాడ పోర్టును మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పరిశీలించారు. అలాగే రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టబడిన నౌక వద్దకు సముద్రంలో పయనించి అక్కడికి చేరుకున్నారు.. అందులో ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్ట్లో బియ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితేకానీ . చర్యలు చేపట్టరా అని పోర్ట్ అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అలాగే డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును కూడా ప్రశ్నించారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.