కడప ప్రతినిధి, జులై 24 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో, జిల్లా ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని.. వైఎస్ఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ఇవాళ ఉదయం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఆమె.. జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అతిది సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, జిల్లా కలెక్టర్ సూచనలు, ఆదేశాల మేరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సహకారంతో.. జాయింట్ కలెక్టర్ గా.. కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను.. ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తొలుత తాను 2020 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారినని, ముందు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా 6 నెలలు పనిచేశానని, అంతకుముందు తొలుత విశాఖపట్నం జిల్లాలో శిక్షణ పొంది విజయవాడ సబ్ డివిజన్ లో సబ్ కలెక్టర్ గా దాదాపు 14 నెలలు పని చేశానని చెప్పారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గా కడప జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటిని మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందించారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు, ప్రముఖులు, పాత్రికేయులు, తదితరులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి జిల్లా జాయింట్ కలెక్టర్ కు తమ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, పులివెందుల, బద్వేలు డివిజన్ల ఆర్డీవోలు వెంకటేష్, చంద్రమోహన్, ఐ అండ్ పీఆర్ ఎడి పి. వేణుగోపాల్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.