ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 29వ తేదీ వరకు ఆలయంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. ఉదయం 9.15 నుండి 10.15 గంటల వరకు మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్ రాజేష్ కుమార్ భట్టర్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీరామనవమి, పోతన జయంతిని నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ధ్వజారోహణం ఘట్టాన్ని ఏకాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్లు వెంకటాచలపతి, వెంకటేశయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు సమర్పణ :
బ్రహ్మోత్సవాల మొదటిరోజైన ధ్వజారోహణం సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి దంపతులు శ్రీ కోదండరామస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శేషవాహనం :
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన బుధవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు శేషవాహనంపై దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు ఆలయంలో ఏకాతంగా వాహనసేవ జరుగనుంది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.