- కడప జిల్లా జమ్మలమడుగులో ఘటన
జమ్మలమడుగు : కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు గ్రామానికి చెందిన ఒక వివాహిత తన మైనర్ కుమారుడిని దొంగతనాలకు ప్రేరేపించింది. దొంగతనాలకు ఉసిగొల్పింది. వివరాలు చూస్తే… సదరు వివాహిత తమ బంధువులు అయిన గుఱ్ఱప్ప, గురుబాబు సహయకుడిగా కొడుకుతో దొంగతనాలకు పంపుతుండేది. అలా వచ్చిన దొంగసొత్తు తనఖా పెట్టి ఆ డబ్బుతో ఆ ముఠా విలాసాలకు అలవాటు పడింది. ఆ నేరస్థులను అరెస్ట్ చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పి నాగరాజు పేర్కొన్నారు. గురువారం ఆ వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు 16వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు మైనర్ బాలుడితో కలిసి దొంగతనాలు చేస్తున్న ముద్దాయిలను మైలవరం మండలంలోని చిన్నకొమ్మేర్ల గ్రామ సరిహద్దుల్లో తలమంచిపట్నం ఎస్సై మంజునాథ్ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.3,50,000/- రూపాయల విలువ గల 73 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆభరణాలు తలమంచిపట్నం , కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులలోని దొంగసొమ్ముగా గుర్తించినట్లు తెలిపారు. పట్టుబడ్డ ముద్దాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.