Tuesday, November 26, 2024

AP : రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడదాం.. నారా భువ‌నేశ్వ‌రి

కడప బ్యూరో – ప్రభ న్యూస్ : రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తాను ధైర్యంగా మీ ముందుకు వచ్చా.. మనందరం కలిసి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె కడప జిల్లాలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వెళ్లి కడప పట్టణం 44వ వార్డులో కార్యకర్త వరద చెండ్రాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో చెండ్రాయుడు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. చెండ్రాయుడు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. చెండ్రాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు

ఈ సందర్భంగా భువనేశ్వరిని చూసి చెండ్రాయుడు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని ఓదార్చిన భువనేశ్వరి.. పార్టీ మీకు అండగా ఉంటుందని చెండ్రాయుడు కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్కచేయని మీ అభిమానానికి నా నమస్కారాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసు. మరో ఐదేళ్లు ఆయనే సీఎంగా కొనసాగి ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయాయన్నారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ఐదేళ్లలో చాలా కోల్పోయారన్నారు. ఈ వైసీపీ రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారింది. దాడులు చేసి అనేక మందిని హత్య చేశారు. ఇటువంటి రాక్షస పాలనలో తాను ధైర్యంగా ఇలా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమే కారణమ‌న్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలి, టీడీపీ జెండాను ఎగరేయడానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేసేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుదాం అంటూ నారా భువనేశ్వరి పిలుపు నిచ్చారు.

ప్రొద్దుటూరులో నిజం గెలవాలి..
అనంతరం భువనేశ్వరి ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు మండలం, పెదశెట్టిపల్లి గ్రామంలో కార్యకర్త కూరపాటి రాధ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో రాధ(39) మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో భువనేశ్వరి రాధ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాధ చిత్రపటానికి నివాళులర్పించారు. భావోద్వేగానికి గురైన రాధ కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని రాధ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement