అమరావతి – రేపటి నుంచి ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వెళ్ళనున్నారు. రెండురోజుల పాటు కడపలో వివిద అభివృద్ది, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్ ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ లో బస చేయనున్నారు. 25న క్రిస్మస్ వేడకల కోసం పులివెందులకు వెళ్ళనున్నారు.
అక్కడ వైఎస్ కుటంబం, స్థానిక ప్రజలతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడినుండే తాడేపల్లికి బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటన షెడ్యూల్ ను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. 23న ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కడపకు బయలుదేరనున్నారు. కడపలో మొదట సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్‌లను ప్రారంభించనున్నారు. ఆ పరిశ్రమ చైర్మన్ సజ్జన్ భజాంకతో పాటు ఉద్యోగులు, కార్మికులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు.
కడపలో ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇదే రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ కేర్ బ్లాక్ ను ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తన తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన ప్లడ్ లైట్లను సీఎం చేతులమీదుగా వెలిగించనున్నారు. అధునీకరించిన కలెక్టర్ కార్యాలయం, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్,కోటిరెడ్డి, సెవెన్ రోడ్స్ సర్కిల్స్ ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. ఇలా అధికారిక కార్యక్రమాలన్ని ముగించుకుని రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్ కు సీఎం చేరుకోనున్నారు.
డిసెంబర్ 24న ఉదయం తన తండ్రి వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళి అర్పించనున్నారు సీఎం జగన్. అనంతరం ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ది పనుల్లో పాల్గోననున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయలోనే సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో సమావేశం కానున్నారు. 2024 ఎన్నికల సంవత్సరం కాబట్టి గెలుపుకోసం ఎలా పనిచేయాలో వివరించనున్నారు.
ఇక డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజు ఇడుపులపాయ ఎస్టేట్ నుండి నేరుగా పులివెందుల సిఎస్ఐ చర్చికి సీఎం జగన్ చేరుకుంటారు. ప్రతి ఏడాదిలాగే కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ క్రిస్మస్ ప్రార్థనలు ముగియగానే తాడేపల్లికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.