కడప, (ప్రభ న్యూస్) : ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పి. విజయబాబుకు గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్టు యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి, గజ్జల మల్లారెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య మునగల సూర్య కళావతి తెలిపారు. ఈ పురస్కారం కింద యాభై వేల రూపాయలు నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారిలో ఒకరికి ఏటా ఈ పురస్కారం ఇస్తున్నారు.
ఇక.. ఆంధ్రప్రభ దినపత్రికలో మ్యాగజైన్ సంపాదకులుగా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన విజయబాబు అదే పత్రికలో ముఖ్య సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషనర్ గా విశేష కృషి చేశారు. ఇండియా న్యూస్ సర్వీస్ ఫర్ యూరఫ్ కంట్రీస్ కు సమన్వయ కర్తగా, జాతీయ పాత్రికేయ సంఘానికి జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు.
ఇండియన్ మీడియా సెంటర్ కు జాతీయ కార్యదర్శిగా కూడా విజయబాబు ప్రత్యేక సేవలందించారు. అంతకు ముందు పల్లకి, ఈతరం, తరంగిణి వార పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. సామాజిక అంశాలపై ఆయన రాసిన ప్రత్యేక వ్యాసాలు కవితలు, ప్రముఖుల జీవిత చరిత్రలు ఎందరికో ప్రేరణగా నిలిచాయి. సమకాలీన సమస్యలపై నిత్యం స్పందిస్తూ విలువైన అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా నిత్యం ప్రజలకు అందిస్తున్నారు.