లోన్ యాప్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్న కమిషన్ ఏజెంట్ ను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సీకే దిన్నే మండలం ఎర్రమాచూపల్లె గ్రామానికి చెందిన సాయి కుమార్ రెడ్డి లోన్ యాప్ ద్వారా రూ.95 వేల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. రూ.65వేలు మాత్రమే యాప్ నిర్వాహకులు అకౌంట్ లో క్రెడిట్ చేసారు. దీనికి గాను 52 సార్లు ఈ.ఎం.ఐ ద్వారా 3.71 లక్షల రూపాయలను బాధితుడు చెల్లించాడు. ఇంకా రూ.99 వేలు బాకీ ఉన్నట్లు పదేపదే వేధింపులకు గురి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కమిషన్ ఏజెంట్ రంగనాథ్ ప్రధాన ముద్దాయిలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈమేరకు రంగనాధ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ముద్దాయిల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవద్దు.. ఒకవేళ వారి వల్ల ఇబ్బందులు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ.. అన్బురాజన్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జిల్లా అడిషనల్ (అడ్మిన్) ఎస్పీ తుషార్ దుడీ, డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐలు శ్రీరామ్ శ్రీనివాస్, శ్రీధర్ నాయుడు, ఎస్సైలు అరుణ్ రెడ్డి,రాజా రాజేశ్వర్ రెడ్డి, మధు మల్లేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.