కడప, ఫిబ్రవరి 15 (ప్రభ న్యూస్) : నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచిందని, దగా డీఎస్సీ కాదని మెగా డీఎస్సీ కావాలని కోరుతూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ విద్యార్థి విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. మంత్రుల ఇళ్లను ముట్టడించాలని పిలుపునిచ్చారు. భాగంగా గురువారం కడప నగరంలోని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇంటిని నిరుద్యోగులు, విద్యార్థులు ముట్టడించారు. దీంతో నగరంలోని గోకుల్ లాడ్జ్ సర్కిల్ లో ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కడప నగరంలోని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమదు యాదవ్ లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నేతలతో కలసి ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే డిప్యూటీ సీఎం ఇంటికి సమీపంలోని గోకుల్ లాడ్జ్ సర్కిల్ వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులను, యువకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిప్యూటీ సీఎం ఇంటి పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నేతలు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ నిరుద్యోగులని నిలువునా మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత రాష్ట్రంలో ప్రశ్నర్ధకంగా మారిందన్నారు. ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్న జగన్ కొన్ని పోస్టులతో దగా డీఎస్సీ విడుదల చేయడాన్ని యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. కమీషన్ల కక్కుర్తితో 5ఏళ్లుగా రూ.17లక్షల కోట్లు పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు.
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ మద్యం వంటి వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వస్తాయని నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, సందీప్, సుశీల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌర్య శీలం, బట్టు శ్రీకాంత్, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్రువ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్లు ప్రొద్దుటూరు వంశీ యాదవ్, జమ్మలమడుగు సునీల్, బద్వేలు మహబూబ్ బాషా, మైదుకూరు మల్లికార్జున్ రెడ్డి, పులివెందుల కొమ్మది శ్రీ సాయి తదితర యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.