Saturday, November 23, 2024

పోలేర‌మ్మ గుడి వ‌ద్ద‌ హత్య – 9మంది అరెస్టు

మైదుకూరు, – మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం పోలేరమ్మ గుడి వద్ద మార్చి 29వ తేదీ జరిగిన హత్య కేసులో9 మంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మంగళవారం డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్ ఈ హ‌త్య కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మార్చి నెల 29వ తేదీ బ్రహ్మంగారిమఠం పోలేరమ్మ గుడి వద్ద నాగరాజు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. హత్య చేయబడిన నాగరాజు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వాడని, అదే గ్రామానికి చెందిన ఆది రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బ్యాంకులలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు డ్రా చేసుకున్నాడని, ఈ విషయాన్ని నాగరాజు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా బయటపెట్టడంతో డ్రా చేసుకున్న డబ్బులు తిరిగి బ్యాంకు కట్టవలసి వచ్చిందని, దీంతో శ్రీనివాస్ రెడ్డి నాగరాజు పై పగను పెంచుకున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక కన్ను లేదని శ్రీనివాస్ రెడ్డి ని నాగరాజు ఎక్కడ పడితే అక్కడ గుడ్డివాడ ని ఎగతాళి చేసేవాడని, ఈ కేసులో మూడవ ముద్దాయి ఐన మేకల ప్రసాద్ రెడ్డి కి ఒక స్థలం విషయంలో నాగరాజు వ్యతిరేకంగా పని చేశాడని మేకల ప్రసాద్ మరియు ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు నాగరాజును చంపాలని నిశ్చయించుకున్నారని వివరించారు. దీంతోప్రొద్దుటూరుకు చెందిన కొంతమంది కిరాయి హంతకులతో మూడు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.నాగరాజు కారును బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగించేవాడని, బ్రహ్మంగారిమఠం కు బాడుగ ఉందని నాగరాజు తో మాట్లాడుకొని పిలుచుకొని పోయారని, బ్రహ్మంగారి మఠం లోని పోలేరమ్మ గుడి వద్ద అందరూ మద్యం సేవించి పెద్ద బండరాళ్ళతో ఇనుప రాడ్ల తో కాళ్ల మీద బలంగా కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు .మెడకు బనియన్ తో బిగించి చంపారన్నారు . ఈ హత్యలో 11 మంది పాల్గొన్నారని, ఈరోజు తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మఠం, కాజీపేట, దువ్వూరు ఎస్ ఐ లు శ్రీనివాసులు, అరుణ్ రెడ్డి, కుల్లాయప్ప లు సబ్ డివిజినల్ పార్టీ భూపాల్ రెడ్డి లను కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement