కడప, రాజంపేట జిల్లాల పరిధిలలోని రెండు ప్రాంతాల్లో 27 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, చిరంజీవులు టీమ్ లు శనివారం కడప, రాజంపేట ప్రాంతాలలో కూంబింగ్ చేపట్టారు. రాజంపేట్ సానిపాయ బేస్ క్యాంపు నుంచి ఆర్ఎస్ఐ విశ్వనాథ్ బృందం తుమ్మల బయలు ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సరస్వతి కటువ అటవీ ప్రాంతంలో కొంత మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా, వారు దుంగలను పడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో 16 ఎర్రచందనం దుంగలతో పాటు 5 రంపాలు, ఒక గొడ్డలి, వంటసామాను లభించాయి. అదే విధంగా కడప సబ్ కంట్రోల్ కార్యాలయం నుంచి ఆర్ఎస్ఐ నరేష్ బృందం రోళ్లమడుగు, పెంటబావి వైపు కూంబింగ్ చేపట్టారు. సిద్దవటం బీట్ పరిధిలోని చెంచలచలిమి వద్ద దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. అయితే వారు ముందుగానే టాస్క్ ఫోర్సు సిబ్బందిని చూసి దుంగలు పడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో 11 ఎర్రచందనం దుంగలు లభించాయి. మొత్తం 27 దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషనుకు తీసుకుని వచ్చి కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సీఐ బాలకృష్ణ, ఎస్ఐ మోహన్ నాయక్ లు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement