ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్‌ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ నాగబాబు ఆరోపించారు. తాజాగా అందుకు సంబంధించి డీటేల్స్‌ను బయటపెట్టారాయన. అంతేకాదు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాము పోలీసు బిడ్డలమని గుర్తుచేశారు నాగబాబు. మీరు అడ్డుగోలుగా ఫైట్ చేస్తే తాము నేరుగా తలపడతామన్నారు. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఇలాంటివారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. ఈ మేరకు నేడు ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు..
పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గీత అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారని, ఆమెకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించి ఆమెతో నామినేషన్ ఉపసంహరింపజేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్ రికార్డును నాగబాబు ఎక్స్ లో షేర్ చేశారు.
పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయకూడదా? ముఖ్యంగా గీత పేరు ఉన్నవాళ్లు ఎవరూ పోటీ చేయకూడదా? జనసేన అభ్యర్థుల పేర్లున్న డమ్మీ వ్యక్తులతో పోటీ చేయించలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన పనులు తాము చేయలేదన్నారు. బెదిరింపులకు దిగేవారి అంతు తేలుస్తామని మరోసారి నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. ఓడిపోయే దశలో ఉన్నారు కాబట్టే అతి చేస్తున్నారని దుయ్యబట్టారు నాగబాబు. దావూద్ ఇబ్రహీంను తెచ్చినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. పిఠాపురంలో ఎవరినైనా బెదిరిస్తే గుణపాఠం తప్పదన్నారు.