కేసు నమోదు కాగానే ఎస్కేప్ అయ్యాడు
వలవేసి డెహ్రడూన్‌లో పట్టుకున్న పోలీసులు
ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపు
అక్టోబరు 4 వరకూ రిమాండ్ విధింపు
ఇక విజయవాడ సబ్ జైలులో ఏ 1 నిందితుడు
తొలుత మీడియాలో రాకుండా హైకోర్టులో పిటిషన్
అసలు నిందితులు బయటకు వచ్చేనా
ఏపీ ప్రజల్లో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
ముంబయి నటి కాదంబరీ జత్వానీపై వేధింపుల కేసులో ఏపీ పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు సోమవారం ఉదయం సబ్ జైలుకు తరించారు. నిందితుడు విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో ఆదివారం అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెడికల్ టెస్టులు చేయించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. అక్టోబరు 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో విద్యాసాగర్‌ను విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
దాక్కున్నా.. పట్టేశారు
నటి కాదంబరీ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేయటంతో.. విద్యాసాగర్ తప్పించుకు తిరుగుతున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన అతడిని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. కాగా, విద్యాసాగర్ మాత్రం కొన్నిరోజులు ముంబయిలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం తెల్లవారు జామున జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
మరి డొంక కదిలేనా..
నటి కాదంబరీ అక్రమ నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు దొరకటంతో.. సస్పెన్షన్ వేటు పడిన పోలీసు అధికారులపై కేసు నమోదు చేస్తారా? అనే అంశం ఉత్కంఠత రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. నేరతీవ్రత ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. తనపై తప్పుడు కేసు నమోదుచేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
మీడియాలో రాకుండా హైకోర్టుకు..
విజయవాడ పోలీసు అధికారులకు కాదంబరి ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మిగిలిన నిందితులెవరో?
నటి కాదంబరీ జత్వానీ కేసులో దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయాన్ని బట్టి నిందితులుగా చేరుస్తామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు అన్నారు. ఇంటరాగేషన్‌లో వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకుని నిందితులుగా ఎవరిని చేర్చాలో నిర్ణయిస్తామని చెప్పారు. నిందితుల విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తమ పరిధిలో ఉన్నంత వరకు రక్షణ కల్పిస్తామని, ఆమెకు ఉన్న ముప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ కేసులో అసలు నిందితులు బయటకు వస్తారా.. వారిపై చర్యలుంటాయా అని ఏపీ ప్రజల్లో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.