Friday, November 22, 2024

సామాజిక స్ఫూర్తి చాటేందుకే కబడ్డీ పోటీలు : భూమన

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : ఆధ్యాత్మిక, సాహిత్య అంశాలతో పాటు క్రీడల పట్ల సామాజిక బాధ్యతతో ఉండాలన్న సందేశాన్ని దేశానికి చాటాలన్న తలంపుతోనే తిరుపతిలో జాతీయ స్థాయి ఆహ్వాన కబడ్డీ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీని నగర పాలక సంస్థ, స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్ఛే నెల 5 వ తేదీ నుంచి 9 వరకు జరిగే టోర్నీలో మన దేశంలోని 22 రాష్ట్రాల నుంచి 700 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నట్టు భూమన వెల్లడించారు. ఈ క్రమంలో దేశాన్ని ఆకర్షించేందుకే నగరంలో 5 కే రన్ నిర్వహించామని తెలిపారు. తిరుపతి ప్రజలు ఉత్సాహంగా 5 కే రన్ లో పాల్గొన్నారన్నారు. కబడ్డీ పోటీలను ఆస్వాదించాలని నగర ప్రజలకు భూమన పిలుపునిచ్చారు.

జాతీయ స్థాయి ఆహ్వాన కబడ్డీ టోర్నీ సన్నాహక కార్యక్రమంలో భాగంగా నగరంలో సోమవారం ఉదయం 5 కే రన్ లో భూమన పాల్గొన్నారు. స్థానిక ఇందిరా మైదానం, నగర పాలక సంస్థ కార్యాలయం, వీవీ మహల్ రోడ్డు, ఘంటసాల సర్కిల్, కేటీ రోడ్డు, అన్నారావు సర్కిల్, మీదుగా నంది సర్కిల్ వరకు 5 కే రన్ సాగింది. ఈ నేపథ్యంలో భూమన మాట్లాడారు. దేశంలోనే తొలిసారి ఓ నగర పాలక సంస్థ జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహించడం గొప్ప పరిణామంగా పేర్కొన్నారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ… తిరుపతి వేదిక నుంచి కబడ్డీ నినాదం దేశమంతటా విస్తరించాలని పిలుపునిచ్చారు. కనీ వినీ ఎరుగని రీతిలో కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నట్టు తెలిపారు.


ఉత్సాహంగా ఆడి, పాడిన భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషా :
కబడ్డీ టోర్నీ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఇటీవలే ఓ సింగర్ గా మారి లే..పంగా అంటూ పాడిన భూమన…తాజాగా డ్యాన్సర్ గా కొత్త పాత్ర పోషించారు. 5 కే రన్ సన్నాహక కార్యక్రంలో భాగంగా ఇందిరా మైదానంలో స్టెప్పులేసి మరీ అందర్నీ ఆకర్షించారు. నగర మేయర్ శిరీషా, అదనపు కమిషనర్ హరిత కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, గాలి సుధాకర్, అదనపు సిటీ ప్లానర్ మోహన్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్.హరికృష్ణ, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిపాలనాధికారి జయరామయ్య, సెట్విన్ సీఈవో మురళీ కృష్ణ, స్పోర్ట్స్ ఆర్గనైజర్ పెన్నా భాస్కర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement