ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వెళ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు, జూన్ 10 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ, వామపక్ష పార్టీలు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన దీక్షకు దిగారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో టెన్త్, ఇంటర్ పరిక్షలు పెట్టడం సరికాదని కేఏ పాల్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్ తెలిపారు. విద్యార్థుల పరీక్షల అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తాను దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుందని చెప్పారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని తాను గత 15 నెలలుగా చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ ను క్యాష్ చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను తమ అధినంలోకి తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు.