Tuesday, November 26, 2024

AP: చంద్ర‌బాబు కంటే కేఏ పాల్ బెట‌ర్ – వెల్లంప‌ల్లి

విజ‌య‌వాడ – ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు ఖరారు అయ్యాయి. అయితే, ఈ మూడు పార్టీల పొత్తులపై విమర్శలు గుప్పిస్తున్నారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాట్‌ కామెంట్లు చేశారు.. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కంటే కేఏ పాల్ పార్టీ (ప్రజాశాంతి పార్టీ)నే బెటర్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ లు పొత్తు కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకి సిగ్గుందా ? అంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి భయపడే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు ముగ్గురే (టీడీపీ-జనసేన-బీజేపీ) కాదు.. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కంటే కేఏ పాల్ బెటర్.. పాల్‌ పార్టీ 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తోంది.. వీళ్ల మాదిరి గుంపులా రావటం లేదు అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement