Saturday, November 23, 2024

ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం

ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరు అవుతామని ప్రకటించారు.

కరోనా సమయంలో చికిత్స అందిస్తూ మృతి చెoదిన డాక్టర్ రోజికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్ అదేశాలు మేరకు జూనియర్ డాక్టర్స్ ప్రతినిధులతో మంత్రి ఆళ్ల నాని మంగళగిరి ఏపిఐఐసిలో చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిందని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సీఎం వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ లో కోవిడ్ విధులు నిర్వహిస్తూ కరోనాతో మరణించిన డాక్టర్ రోజికి రూ.25 లక్షలు రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

కరోనా సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన డాక్టర్ భాస్కర్ కి సీఎం కోటి 50 లక్షలు రూపాయలు సాయం అందించారని తెలిపారు. అవసరం అయితే మరింతగా ఆర్ధిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హాస్పిటల్స్ లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కోసం వైద్య సేవలు అందించడానికి సుమారుగా 30 వేల మందిని రిక్రూట్మెంట్ చేశామన్నారు. ఏపిలో పీజీ చదివే వైద్య విద్యార్థులకు ఫీజు రూ. 26 లక్షలు నుండి రూ. 5 లక్షలు వరకు తగ్గిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement