విజయవాడ – కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు.. కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలిపారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు . విజయవాడ గాంధీ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను, ఎంపీలను స్ధానాలను మారిస్తే, ఒకచోట చెల్లనిది మరోచోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని ప్రశ్నించారు. బలహీనవర్గాల నాయకులను తక్కువ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బిసి కార్పొరేషన్ల చైర్మన్ లకు అధికారాలు లేవు…
బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల కు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని మండిపడ్డారు రుద్రరాజు.. టీడీపీ ఇద్దరితోనే నడుస్తోందని పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ లపై సెటైర్ వేశారు. అలాగే అందరూ రండి కలిసి పనిచేద్దాం అంటూ ఇతర పార్టీల నేతలకు ,కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయిందని, అంటూ మత్తు పదార్ధాలు, గంజాయి అక్రమ రవాణా, సేద్యం మీద ఉక్కుపాదం మోపాల్సి ఉందన్నారు. 25 వేల కోట్ల రూపాయల మద్యం రాష్ట్రంలో అమ్ముడవుతోందన్నారు. పార్టీ నాయకుల మనోభావాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ తెలుసుకున్నారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండలాధ్యక్షులను నియమించుకున్నామని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.