Friday, November 22, 2024

సందిగ్థంలో న్యాయరాజధాని.. తరలింపు సాధ్యం కాదన్న‌ హైకోర్టు..

కర్నూలు, ప్రభన్యూస్‌: గత ఎన్నికల్లో టిడిపి పరాజయం చెందడం, వైకాపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చకచక జరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు 2019లో ప్రకటించారు. అసలే రాజధానిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కర్నూలు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన ఊరటకల్పించింది. అ మేరకు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డిఏ రద్దు బిల్లులను ముందుగా మంత్రివర్గంలో, ఆ తర్వాత శాసన సభలో ఆమోదం, తదుపరి గవర్నర్‌ ఆమోదంతో రెండేళ్ల క్రితం ఆర్డినెన్స్‌ జారీ జరిగిపోయాయి.

ఈ బిల్లుల చట్టబద్ధత అంశం హైకోర్టుకు చేరడం, స్టేటస్‌ కో ఉత్తర్వుల నేపథ్యంలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. కర్నూలులో న్యాయ రాజధానికి ఇప్పట్లో అడుగులు పడేనా అన్న అనుమానాలు అప్పట్లోనే కలిగాయి. కర్నూలులో హైకోర్టు అనేది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కానే కాదు. రాష్ట్రం ప్రతిపాదిస్తే, కేంద్రం ఆమోద ముద్రతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. అప్పుడు కాని కర్నూలుకు హైకోర్టును అమరావతి నుంచి తరలించే అవకాశం ఉంద.

కేంద్రం నోటిషికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదని, అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయరాజధాని ఎలా సాధ్యమని, రాజు లేకుండా రాజధాని ఎలా సాధ్యమవుతుందని వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కలకలం కారణమైంది. అమరావతి విషయంలో ఓ సారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీలులేని క్రమంలో, అదే తరహాలో ఏపీ విభజన చట్టం మేరకు హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్రం ఓ సారి నిర్ణయం తీసుకుందని, రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ అయింది. తన పరిధి కాని హైకోర్టు అంశాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం భుజాన వేసుకొని కర్నూలు వాసులకు న్యాయరాజధాని అంటూ హామీఇవ్వడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుండగా, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని అసలు ఏర్పాటు అవుతుందా లేదా అన్నది తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఈ విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇటీవల అసక్తికరమైన వాదనలు తెరపైకి రావడం గమనార్హం.

రాష్ట్రపతి నోటిపై చేసిన తర్వాత ఏర్పడ్డ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు ఎలా మారుస్తారు. శాసన సభలో చట్టం చేసేసి హైకోర్టును మార్చేస్తామంటే ఎలా అన్న అంశాలను ఇటీవల హైకోర్టు తెరపైకి తెచ్చింది. దీన్నిబట్టి కర్నూలులో హైకోర్టు నినాదం ఎత్తుకున్నారు తప్ప, ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం ప్రతిపాదనతో నిరూపితం అయింది. ఇదిలా ఉంటే రాజధాని కోసమంటూ మూడు కమిటీలు వేయడం, రాజధాని చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ నాటకం సీమ వాసులకు పెనుశాపంగా మారనుంది. పరిపాలన రాజధాని విషయంలో అడ్డంకులు తొలగిపోయినా న్యాయరాజధాని విషయంలో మరిన్ని చిక్కుముడులు ఉన్నాయని, కర్నూలుకు హైకోర్టు తరలించడం అంత ఈజీ కాదన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యాయ రాజధాని కర్నూలుకు తరలింపులో ఎన్నో చిక్కుముడులు నెలకొన్న క్రమంలో, కర్నూలు జగన్నాథ గట్టులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీశైలం పర్యటనలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం జగన్నాథ గట్టులో 250 ఎకరాలు కేటాయించినట్లు ప్రకటించారు. వాస్తవంగా 2019లో కర్నూలును జ్యూడిషియల్‌ క్యాపిటల్గా మార్చేందుకు ఏపి అసెంబ్లీలో తీర్మాణం చేసిన సంగతి విధితమే. అయినప్పటికి మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి జగన్నాథ గట్టులో హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా భూములు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కల్లూరు, కర్నూలు పరిధిలోని జగన్నాథ గట్టు పరిసరాలో రూ.లక్షలు పలికే భూములు రూ.కోట్లకు చేరుకున్నాయి.

- Advertisement -

మంత్రి ప్రకటనతో జగన్నాథ గట్టు చుట్టు రియల్‌ వ్యాపారులు భారీగా కొనుగోలు చేశారు. గత డిసెంబర్‌లో మంత్రి ప్రకటన చేయగా, ఇప్పటికే వేలకోట్లలో భూ అమ్మక, కొనుగోలు జరిగాయి. వ్యాపారులు భారీగా కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. అయితే న్యాయ రాజధాని అంశంపై కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడం, ఇదే సందర్బంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌ సభలో కీలక వ్యాఖలు చేయడం ప్రజలను ఆలోచింపజేసింది. దీంతో ఒక్కసారిగా రియల్‌ వ్యాపారం డమాల్‌ అయింది. భూములపై అడ్వాన్స్‌లు చెల్లించినా వ్యాపారులు సందిగ్దంలో పడ్డారు.

ఈ పరిస్ధితుల్లో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అంశం అంతా ఈజీ కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖలు చేయడం ప్రస్తుతం రియల్‌ వ్యాపారులతో పాటు ప్రజలను సందిగ్దంలో పడేసింది. మరి ఈ అంశంపై ఏపి పాలకుడైన జగన్నాథుడు ఏమి చేస్తారన్నది ప్రస్తుతం భేతాళ ప్రశ్నగా మారనుంది. మొత్తంగా కర్నూలు జిల్లాలో హైకోర్టు ప్రకటనకు ఇప్పటికే రెండున్నర ఏళ్ల కాలం ముగియగా, మరో రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి న్యాయ రాజధాని ఏర్పాటు అంశం సాధ్యమయేలా లేదు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement