Monday, November 18, 2024

Judgement – హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేం – పోస్ట‌ల్ బ్యాలెట్ల‌పై సుప్రీం వెల్ల‌డి

సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ పార్టీకి చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్లపై జూన్ 1న (శనివారం) హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వైసీపీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా ఇప్పటికే టీడీపీ ఏమ్మెల్యే వెలగపూడి సుప్రీం కోర్టులో కేవియట్దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన వైసీపీ

పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసింది.అయితే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్‌లో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల కౌంటింగ్ తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది.కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వైసీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

చెవిరెడ్డికి ఝలక్

చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. . ఈ అంశంపై తాము జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement