Friday, October 4, 2024

Judgement – తిరుప‌తి ల‌డ్డూ – అయిదుగురు స‌భ్యుల‌తో సిట్ ఏర్పాటు – సుప్రీం కోర్టు

ఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు అయిదుగురు స‌భ్యుల‌తో విచార‌ణ క‌మిటీ వేయాల‌ని అదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు,
ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమసంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై ఈ సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది.. అనంత‌రం ఆ విచార‌ణ నేటికి వాయిదా ప‌డింది. నేడు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. .

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. “మొత్తం అంశాన్ని పరిశీలించాను. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది” అని చెప్పారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement