( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) అటు కేంద్రంలో నరేంద్ర మోదీ 3.0 సర్కారు.. ఇటు ఏపీలో చంద్రబాబు 4.0 ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే… స్టాక్ మార్కెట్లు కళ కళలాడుతున్నాయి. ఇప్పటి వరకూ గత ఐదేళ్లల్లో సాదా సీదాగా.. ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా సెన్సెక్స్లో పాయింట్ల కదలిక లేకుండా సాగిన ఏపీ స్టాక్ మార్కెట్టు అకస్మాత్తుగా రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తోంది. ఈ ఎన్నికల్లో ఏపీ కూటమి అనూహ్య ఘన విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు షరిష్మా జిగేల్ మంటోంది. ఆయన ఇమేజీ అమాంతం పెరిగిపోయింది. అటు ఎన్డీయే భాగస్వామిగా కేంద్రంలోనూ చంద్రబాబు కీలకం కావటంతో, ఇటు ఏపీలోనూ అటు కేంద్రంలోనూ ఆయనకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్ల పై పెరిగింది.
ఏపీ, చంద్రబాబు తాలూకు స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హట్‌కేకుల్లా మారాయి. దీంతో గత 8 సెషన్లలోనే వీటి ఎం -క్యాప్ విలువ ఏకంగా రూ. 20 వేల కోట్లకు చేరింది. హెరిటేజ్ ఫుడ్స్, కేసీపీ, ది ఆంధ్ర సుగర్స్, పెన్నార్ ఇండస్ట్రీస్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అటు ఇన్‌ఫ్రా స్టాక్స్ పై కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ కు నారా లోకేశ్ ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో ఆయన 40 శాతం వాటాను కలిగి ఉన్నారు కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్, అమరా రాజాతో పాటు పలు సిమెంట్ సంస్థలు డబుల్ డిజిట్ లాభాలు పొందాయి. ఆంధ్ర స్టాక్స్ ఎం-క్యాప్ వ్యాల్యూ జూన్ 4వ తేదీ నుంచి రూ. 2, 19, 000 కోట్లుగా కొనసాగుతోంది. అటు రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ కూడా జోరు అందుకుంది. అమరావతిలో గజం స్థలం ధర రూ.30 వేల నుంచి అకస్మాత్తుగా రూ.లక్ష కు చేరినట్టు భోగట్టా.