అమరావతి: రెండు మూడు రోజుల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నాదెండ్ల మనోహర్ ఉంటారని, రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు అన్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటింగ్ చీలకుండా చూడటమే తమ ఉద్దేశమన్నారు. జీ 20 సదస్సు జరుగుతుంటే చంద్రబాబు ను అరెస్ట్ చేశారన్నారు.
రాష్ట్రాన్ని నడిపే అధికారులకు కూడా 20వ తేదీ వచ్చేవరకు జీతాలు రాలేని పరిస్థితి నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘ఐఏఎస్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఐఏఎస్ల జీతాలు మళ్లించారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన వైకాపాకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనలో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తారు. సమస్యలు లేవనెత్తితే ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికే జగన్, ఎంపీలు దిల్లీ వెళ్తున్నారా?’’ అని పవన్ ప్రశ్నించారు.