జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని పెంచాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు సేవ చేసే విషయంలో గతంలో వైసీపీ నాయకులు నిర్లక్ష్యం చేశారని, మా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల విషయంలో నిర్లక్షం చెయ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
కాగా, శనివారం పవన్ కల్యాణ్ సమక్షంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఆమె కుమార్తె ముద్రగడ క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఆమెతోపాటు గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, జగ్గయ్యపేటకు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అందరికీ జనసేన కండువాలు కప్పిన పవన్ కల్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
‘పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పని చేస్తోంది. అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రూపాయి లంచం లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా బదిలీలు జరిగాయి. లంచం అనే పదం వినిపిస్తే కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందే. గుడివాడలో తాగునీటి సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాం. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని పవన్ పేర్కొన్నారు.