Saturday, January 11, 2025

Jobs – ఎక్క‌డ చ‌దివితే అక్క‌డే ఉద్యోగం – ఎపి ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

విద్యార్ధుల‌కు స్కిల్ కోర్సులు
ప్రాంతాల వారిగా వివిధ సాంకేతిక‌త వృత్తుల‌పై శిక్ష‌ణ‌
పాలిటిక్నిక్ క‌ళాశాల‌లో కొత్త కోర్సులు
త‌క్కువ ఖ‌ర్చుతో విద్య .. పూర్తి అయితే ఆ వెంట‌నే ఉద్యోగం

వెల‌గ‌పూడి – ఎపిలోని కూట‌మి ప్ర‌భుత్వం విద్యార్దుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.. ఇక ఏ జిల్లాలో చ‌దివితే ఆ జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.. విద్యార్ధుల‌లో స్కిల్ పెంచేందుకు సాంకేతిక‌, వృత్తి విద్యా కోర్సుల‌ను పాలిటెక్కిక్ క‌ళాశాల‌ల ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

వివ‌రాల‌లోకి వెళితే ఏపీలో కూటమి ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్లలో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. అయితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన పెను సవాల్ గా మారిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు నిపుణుల కొరత చాలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్దానికంగా ఉన్న పరిశ్రమల్లో నిపుణులకు అవసరమైన కోర్సుల్ని అందుబాటులో ఉంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించబోతోంది.

- Advertisement -

ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లు, 10 సెక్టార్లుగా విభజిస్తోంది. ఉమ్మడి జిల్లాలను క్లస్టర్లుగా తీసుకుని స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ లలో అక్కడి పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను బోధించే కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ లెక్కన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫార్మా కోర్సులు, గోదావరి జిల్లాల్లో ఆక్వా కోర్సులు, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టెక్స్ టైల్స్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గ్రానైట్, ఆయిల్ ఉత్పత్తి సంబంధిత కోర్సులు, చిత్తూరు, కర్నూల్లో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ సంబంధిత కోర్సులు, అనంతపురం-కడపలో ఆటోమొబైల్, సిమెంట్, అనుబంధ కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న మరో సమస్య పాలిటెక్నిక్ చదివిన విద్యార్ధులు ఆ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్లిపోతున్నారు. దీంతో పరిశ్రమల్లో మధ్యతరగతి ఉద్యోగులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఈ కొరత అధిగమించేందుకు పాలిటెక్నిక్ చదివిన వారికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించే కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో యువత స్థానికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఈ కోర్సుల్ని ఎంచుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్ని పాలిటెక్నిక్స్ లో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆయా కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు అక్కడే ఉండి పరిశ్రమల్ని సంప్రదించి క్యాంపస్ నియామకాల్ని లభించేలా చేస్తున్నారు. దీంతో విద్యార్ధులు కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా లోకల్ లో ఉండి చేసుకునే ఉద్యోగాలకు ఆసక్తి చూపడంతో పాటు పరిశ్రమలకు మానవ వనరుల కొరత కూడా తీరబోతోంది. ఈ మేర‌కు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌ను అప్ గ్రేడ్ చేసి త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement