అమరావతి,ఆంధ్రప్రభ: రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఎపిపిఎస్‌సి బోర్డు మెం బర్ పరిగే సుధీర్ తెలిపారు. 111 గ్రూపు వన్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న గ్రూపు వన్ పోస్టులకు సంబంధించి పూర్తి ప్రక్రియను అగస్టు చివరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. గ్రూప్ 4కు సంబంధించిన ఫలితాలను మే 3వ వారంలోగా విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం సుధీర్ ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న మూడు నెలల కాలంలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
అందులో ముఖ్యంగా గ్రూపు 2కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. గ్రూప్ వనకు సంబంధించి 140 పోస్టుల ను భర్తీ చేస్తామన్నారు. ఇవి కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు 400 దాకా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అయితే ఎన్ని పోస్టులు అనేది ప్రభుత్వం నుండి సంఖ్య రావాల్సి ఉందన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు సంబంధించిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటికే వివిధ రకాల 124 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశామని, వాటన్నింటినీ పరీక్షల తేదీలను వచ్చే వారంలోనే ప్రకటిస్తామని సుధీర్ తెలిపారు.
సమగ్రత కోసమే గ్రూప్ 2 సిలబస్‌లో మార్పు
గతంలో ఉన్న గ్రూపు 2 సిలబస్‌లో కొంత గందరగోళముందని, సిలబస్ 35 శాతం దాకా రిపీట్ అయ్యిందని, ఈ కారణాల రీత్యానే కొత్తగా సిలబస్‌ను రూపొందించినట్లు సుధీర్ చెప్పారు. పాత సిలబస్‌లో హిస్టరీకి, పాలిటికి చెరి 75 మార్కులు ఉంటే ఒక్క ఎకనామిక్స్‌కే 150 మార్కులు ఉం డేవని, దీని వల్ల ఎకనామిక్స్‌ను ప్రధాన సబ్జెక్ట్‌గా చదివిన వారితో పోల్చుకుంటే మిగిలిన వారికి పరీక్షలో అన్యాయం జరిగేదని అన్నారు. ప్రస్తుత సిలబస్‌లో ఎకనామిక్స్‌ను 75మార్కులకు పరిమితం చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కులు కేటాయించినట్లు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని, అందులోనూ గ్రాస్‌రూట్‌లో పనిచేసే గ్రూపు 2 అధికారులకు ఇది చాలా అవసరమని చెప్పారు.
అలాగే కొత్తగా ఇండియన్ సోసైటీ అనే కొత్త సిలబస్‌ను తీసుకొచ్చామని, భారత సమాజం ఎలా ఉందని, కులాలేంటి, మతాలేంటి, వాటి వల్ల వచ్చే సమస్యలేంటి, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు ఏంటనేది ఈ సబ్జె క్ట్‌లో ఉంటుందని, ఈ అంశాలపై అవగాహన గ్రూప్ 2 అధికారికి చాలా అవసరమని, అందుకే సిలబస్‌లో మార్పలు చేశామని చెప్పారు. సిలబస్ ఏంటనేది స్పష్టంగా పేర్కొన్నామని, దీంతో ఏ అభ్యర్ధయినా ఎటువంటి కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయవచ్చని అన్నారు.
న్యాయ సమస్యలకు తావులేకుండా…
నోటిఫికేషన్లు ఇవ్వడంలోగానీ, పేపర్‌ను సెట్ చేయడంలో గానీ న్యాయ పరమైన సమస్యలకు తావు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుం టున్నామని సుధీర్ చెప్పారు. పేపర్‌ను సెట్ చేసేప్పుడు సిలబస్‌ను దాటి పోకుండా, ట్రాన్స్‌లేషన్ తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చాలా పకడ్బందీగా పేపర్‌ను సెట్ చేస్తున్నట్లు చెప్పారు. ఎపిపిఎస్‌సి ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో ఏ నోటిఫికేషన్ కయినా పరీక్ష నిర్వహించినప్పటి నుండి చకా చకా మిగతా ప్రక్రియ నంతా పూర్తి చేస్తున్నామని తెలిపారు. గ్రూప్ వన్ ప్రిమినరీ రిజల్ట్ 20 రోజుల్లోనే ఇచ్చినట్లు సుధీర్ చెప్పారు.