అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తీసుకుంటు-న్న చర్యల ఫలితంగా వందలాది మంది విద్యార్ధులు ఉపాధి పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం మార్చి 24, 25 తేదీల్లో మరో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగ రాణి తెలిపారు. హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియా సంస్ధ ప్రతినిధులతో సోమవారం సమావేశమైన సాంకేతిక విద్యా శాఖ ప్రతినిధి బృందం ఈ మేరకు అవగాహనకు వచ్చింది. హెచ్ఎల్ మండో సంస్ధ మానవవనరుల విభాగం డిజిఎం రాజశేఖర్, మేనేజర్ రాగిణిలతో ఈ మేరకు సమావేశం జరిగింది.
ఫలితంగా 200 మంది టెక్నీషియన్ అప్రెంటీస్‌ల రూపేణా తక్షణ ఉపాధి పొందనున్నారని నాగరాణి వివరించారు. మాండో గ్లోబల్ సంస్ధగా కొరియా, అమెరికా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, చైనా, భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలలో కార్యకలాపాలను కలిగి ఉందని తెలిపారు. హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోక్స్వ్యాగన్, ఆడి, చేవ్రొలెట్, కియా, సుజుకి మొదలైన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో ఈ సంస్ధ వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉందన్నారు. మార్చి 24, 25 తేదీల్లో ఒంగోలులోని డిఎ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో జాబ్ మేళా నిర్వహిస్తామని, 2020, 2021, 2022 సంవత్సరాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు.
60శాతం మార్కులతో మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్రల్ విభాగాలలో ఉత్తీర్ణులైన బాల బాలికలు, ఎలక్ట్రాన్రిక్స్, ఇన్‌స్ట్రుమ్రెంటేషన్, కంప్యూటర్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన బాలికలు జాబ్ మేళాకు హాజరు కావడానికి అర్హత కలిగి ఉంటారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 8870985062, 8985872905 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. డిప్యూటీ డైరెక్టర్ (శిక్షణ, ప్లేస్మెంట్) డాక్టర్ ఎంఎవి రామకృష్ణ, సాంకేతిక విద్యా శాఖకు చెందిన అధికారుల బృందం జాబ్ మేళా కార్యక్రమాలను సమన్వయం చేస్తారని వివరించారు.