జియోఫోన్ నెక్ట్స్ విడుదలపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జియో-గూగుల్ సంయుక్తంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. దీపావళి సందర్భంగా దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వినాయక చవితి రోజే ఫోన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాలతో దీపావళికి వాయిదా వేసినట్టు తెలిపారు.
భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడకం భారీగా పెరిగిందన్నారు. సరికొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్‌లను భారతీయులు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా భారత్ తీవ్రంగా ప్రభావితం అయ్యిందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని వివరించారు. దీన్ని తాము ఓ అవకాశంగా మలుచుకుంటున్నట్టు తెలిపారు. జియోతో కలిసి రూపొందించిన ఈ ఫోన్ ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు.
లోకల్ లాంగ్వేజెస్…
ప్రాంతీయ భాషల వారికి కూడా ఈ ఫోన్ అందుబాటు ధరలో తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని, జియోతో కలిసి ముందుకు వెళ్లడం సంతోషకరమైన విషయమని పిచాయ్ తెలిపారు. చాలా మందికి స్మార్ట్‌ఫోన్ ప్రయోజనాలు అందనున్నాయన్నారు. ఈ కొత్త ఫోన్‌తో అనేక మంది తొలిసారి ఇంటర్‌నెట్ సేలను ఉపయోగించు కోనున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా కొత్త అవకాశాలు వారి దరికి చేరనున్నాయన్నారు. భారత్‌తో పాటు ఆసియా, పసిఫిక్ దేశాల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని వివరించారు. రానున్ను 3-5 ఏళ్లలో అనేక మార్పులు రానున్నాయని తెలిపారు. తమ ఉత్పత్తులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలయన్స్ జియో కూడా ఇప్పటికే ఫోన్ విడుదలపై స్పష్టత ఇచ్చింది. ఫోన్ ఫీచర్స్‌కు సంబంధించిన పలు ఫీచర్లను కూడా రిలయన్స్ జియో ఓ వీడియో రూపంలో విడుదల చేసింది.