Tuesday, November 26, 2024

జిన్నా టవర్​కు మూడు రంగులు.. ఏపీలో వివాదం సద్దుమణిగినట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులోని మహాత్మాగాంధీ రోడ్‌లో ఉన్న జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వేశారు.  చాలా రోజులుగా వివాదాస్పందా ఉన్న ఈ జిన్నా టవర్​కి YSRCP ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మూడు రంగులతో వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయాలనుకున్న హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న వారం తర్వాత వివాదం లేకుండా చేశారు.

మహాత్మా గాంధీ రహదారిపై ఉన్న జిన్నా టవర్ గుంటూరు నగరంలో ఒక ప్రముఖ,  ఐకానిక్ నిర్మాణం. పోలీసుల చర్యపై బిజెపి నేతలు మండిపడ్డారు. ఇతరులు హిందూ వాహిని కార్యకర్తల నిర్బంధాన్ని ఖండించారు. వివిధ వర్గాల అభ్యర్థన మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, జాతీయ జెండాను ఎగురవేసేందుకు సమీపంలో స్తంభాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు గుంటూరు మేయర్ వివరించారు. అన్ని వర్గాల ప్రజలు, మతాల ప్రజలు ప్రశాంతంగా జీవించే గుంటూరులో శాంతియుత వాతావరణాన్ని పాడు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు దీన్ని పెద్ద ఇష్యూగా చేసి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో టవర్ దగ్గర జాతీయ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. గుంటూరులోని జిన్నా టవర్‌ పేరు మార్చాలని గతంలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ డిమాండ్‌ చేసింది. జిన్నా టవర్ పేరును ఏపీజే అబ్దుల్ కలాం పేరుగా మార్చాలని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సూర్యకుమార్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకుంటే పార్టీ కార్యకర్తలు టవర్‌ను కూల్చివేస్తారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, పలు వివాదాల నేపథ్యంలో ఈ టవర్​కు మూడు రంగులు వేయడంతో ఇప్పుడు సమస్య సద్దుమణిగినట్టేనని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement