Friday, November 22, 2024

వినూత్న రీతిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన..

తాడిపత్రి టౌన్, ఏప్రిల్ 25 (ప్రభ న్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మంగళవారం ఉదయం స్నానం చేస్తూ వినూత్నమైన రీతిలో నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చేపట్టిన నిరసనకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తుండగా శాంతిభద్రత సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం విధితమే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రి ఇంటి నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డగించారు.

దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి వరకు రహదారి పక్కన డివైడర్ పై బైఠాయించారు. ఎట్టకేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం అక్కడే నిద్రించి ఉదయం బ్రష్ చేసి స్నానం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదర్శవంతమైన మున్సిపాలిటీని అద్వాన్నంగా తయారు చేశారని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, టైర్లు, డీజిల్, ఇనుము ఇలా ఇంకా ఎన్నో మాయమవుతున్నాయని, ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉందని ఆయన విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ వచ్చేవరకు నిరసన విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement