కాకినాడ కేంద్రంగా రాష్ట్రంలో 28శాఖలు నిర్వహిస్తున్న ది జయలక్ష్మి కో ఆపరేటీవ్ బ్యాంక్ బోర్డు తిప్పేసింది. ధరావతుదార్లు చెల్లించిన సుమారు 480కోట్లకు బదులు చెప్పలేక యాజమాన్యం పరారైంది. బ్యాంక్ డైరెక్టర్లు, ఉన్నతోద్యోగులంతా ఆజ్ఞాతంలోకెళ్ళిపోయారు. రెండు దశాబ్ధాల క్రితం ఈ బ్యాంక్‌ను స్థానిక వ్యాపారులు కొందరు ప్రారంభించారు. అంచెలంచెలుగా ఈ బ్యాంక్ విస్తరించింది. నమ్మకంగా ధరావతుల్ని స్వీకరించింది. జాతీయ బ్యాంకులకంటే అదనంగా వడ్డీ ఆశపెట్టి పెద్దమొత్తంలో ప్రజల్నుంచి డిపాజిట్లు సేకరించింది. ఇందులో కొన్ని డిపాజిట్లకు రెండు మాసాలక్రితమే గడువు తీరింది. అప్పట్నుంచి ధరావతుదార్లు చెల్లింపుల కోసం బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో కొందరికి ఏప్రిల్ 6న పూర్తి స్థాయి చెల్లింపులు జరుపుతామంటూ బ్యాంక్ అధికారులు హామీనిచ్చారు. అంతవరకు నిరీక్షించాలని కోరారు. సమ్మతించిన ధరావతుదార్లు తిరిగి బ్యాంక్ శాఖల వద్దకు చేరుకున్నారు.
బాధితుల ఆందోళన..
అయితే సాధారణ సిబ్బంది తప్ప బదులిచ్చేందుకు బ్యాంక్ అధికారులెవరూ అందుబాటులో లేరు. అలాగే డైరెక్టర్ల ఆచూకీ కూడా ధరావతుదార్లకు లభించలేదు. దీంతో బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట ధరావతుదార్లు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని 28శాఖల వద్ద కూడా ఇలాంటి పరిస్తితే ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న సహకార శాఖ రిజిస్ట్రార్ వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. సంబంధిత అధికారులు బ్యాంక్ శాఖల్లోని రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ మేరకు నిధుల సమీకరణ జరిగింది.. ఆ నిదుల్ని ఎక్కడెక్కడా పెట్టుబడి పెట్టింది పుస్తకాల ద్వారా ఆరాతీస్తున్నారు. దీనిపై స్పందించేందుకు క్రిందిస్థాయి సిబ్బంది భయాందోళనకు గురౌతున్నారు.బ్యాంక్ ఉన్నతాధికారులు అందుబాటులో లేరు. కాగా సహకార శాఖ ఉన్నతాధికారులు మాత్రం పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చేందుకు కనీసం రెండుమూడు వారాలు పడుతుందని స్పష్టం చేశారు.
రంగంలోకి పోలీసులు..
మరోవై పు పోలీస్ అధికారులు బరిలో దిగారు. బ్యాంక్ డైరెక్టర్లు, ఉన్నతోద్యోగుల కోసం గాలింపు ప్రారంభించారు. ధరావతుల్ని రిజర్వ్‌బ్యాంక్ నిబంధనలకనుగుణంగా వినియోగిస్తున్నదీ లేనిదీ ఇప్పటి వరకు సహకార శాఖాధికారులు తనిఖీ చేయలేదు. ఇందుకు బ్యాంక్ డైరెక్టర్లకున్న రాజకీయ పరపతే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్లు ఈ ధరావతుల్ని ఇతర మార్గాల్లో పలు వ్యాపారాలకు మళ్ళించారన్న ఆరోపణలున్నాయి. అలాగే పలు స్థిరచరాస్తుల్ని కొనుగోలు చేసారంటూ ధరావతుదార్లు విమర్శలకు దిగుతున్నారు. కొందరు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకొచ్చిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మొత్తాల్ని అధిక వడ్డీ ఆశకు లోబడి ఇందులో డిపాజిట్ చేశారు. అలాగే కూతుళ్ళ పెళ్ళిళ్ళు, ఇళ్ళ నిర్మాణ కోసం కొద్ది కొద్దిగా డబ్బు కూడబెడుతూ అధిక వడ్డీ ఆశతో పలువురు ఈ బ్యాంక్ బారిన పడ్డారు. వారంతా ఇప్పుడు ఘొల్లు మంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..