Friday, November 22, 2024

ముంచుకొస్తున్న జవాద్‌.. ప్ర‌మాదంలో విశాఖ‌..

ప్ర‌భ‌న్యూస్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాన్‌గా మారిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ జవాద్‌ తుపాన్‌ విశాఖపట్నానికి ఆగ్నేయంగా 360 కి.మీ, ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 470 కి.మీ, పారాదీప్‌కు దక్షిణ నైరుతిగా 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రేపు ఉదయం నాటికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంటుందని, ఆ తదుపరి ఉత్తర ఈశాన్య వైపు దిశను మార్చుకుని కదులుతూ.. ఒడిశా తీరం వెంబడి పూరి దగ్గరకు చేరనుందని తెలిపారు.

ఇక అనంతరం 24 గంటల తరువాత.. వాయుగుండం మరింత బలపడి తుపాన్‌గా మారుతుందని హెచ్చరిస్తోంది. తుపాన్‌ తీరం దాటే సమయంలో.. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చెబుతున్నాయి. జవాద్‌ అనే పేరును సౌదీ అరేబియా పెట్టింది. అరబిక్‌ భాషలో జవాద్‌ అంటే గొప్పది, ఉదార, దయగల అని అర్థాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

జవాద్‌ తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సూచించినట్టు పీఎంఓ ప్రకటనలో తెలిపింది. పలువురు కేంద్ర మంత్రులు, పలు ఏజెన్సీల అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా.. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, ఆరోగ్యం, తాగునీరు తదితర నిత్యావసరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతరాయం కలిగితే సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అవసరమైన మందులు తగినం నిల్వ ఉండేలా చూడాలని ఆదేశించినట్టు పీఎంఓ తెలిపింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో కనెక్టివిటీ ఉన్న పలు రైళ్లను ఆ శాఖ రద్దు చేసింది. కోణార్క్‌ ఫెస్టివల్‌, ఇంటర్నేషనల్‌ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. సెంట్రల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) రాష్ట్రాల్లో 29 బృందాలను మోహరించింది. మరో 33 బృందాలను అందుబాటులో ఉంచారు. నేషనల్‌ కోస్ట్‌ గార్డ్‌, నేవీ కూడా సహాయ చర్యల కోసం నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీకి చెందిన ఇంజినీర్‌ టాస్క్‌ఫోర్స్‌ను సైతం పడవలు, అవసరమైన రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉండాలని కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement