Sunday, September 8, 2024

పెద్దల సభలో జంగారెడ్డిగూడెం రగడ.. టీడీపీ ఆందోళనతో వాయిదాల పర్వం

అమరావతి, ఆంధ్రప్రభ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై శాసనమండలిలో చర్చకు టీడీపీ పట్టు పట్టింది. సోమవారం సభ ప్రారంభం అయిన వెంటనే టీడీపీ జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ఈ తీర్మానాన్ని శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెంలో 25 మంది కల్తీసారా సేవించి మృతి చెందారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. సరైన ఫార్మెట్‌లో వస్తే ప్రభుత్వంతో మాట్లాడి చర్చకు అనుమతిస్తామని ఛైర్మన్‌ హామీ ఇచ్చారు. ఈ హామీను తెలుగుదేశం పార్టీ సభ్యులు తిరస్కరించారు.

ఇంతపెద్ద ఘటనపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకువచ్చారు. చర్చకు పట్టుబడుతూ ఆందోళనను కొనసాగించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. తాము అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఈ మరణాలను వేరే రకంగా చూపట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్‌ మోషేన్‌ రాజు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే వాయిదా పడింది. సుమారు ‘గంటా 10 నిమిషాల’ అనంతరం తిరిగి సభ సమావేశమైంది. ఇదే అంశంపై టీడీపీ మరోసారి ఆందోళన చేపట్టింది.

బీజేపీ సభ్యుడు మాధవ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మరణాలపై ప్రభుత్వంతో స్టేట్‌మెంట్‌ ఇప్పించాలని ఛైర్మన్‌ను కోరారు. సభ్యుల కన్నా ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, ప్రభుత్వంతో మాట్లాడి చర్చకు అనుమతిస్తామని మరోసారి ఛైర్మన్‌ టీడీపీ సభ్యులకు తెలిపారు. అయినప్పటికీ తెదేపా సభ్యులు ఆందోళనను కొనసాగించారు. దీంతో శాసనమండలి మరోసారి వాయిదా పడింది. తిరిగి మరోగంట తర్వాత సమావేశమైనప్పటికీ పరిస్థితి యథావిధిగా ఉండటంతో ఛైర్మన్‌ పెద్దల సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement