Varahi Yatra | అసెంబ్లీకి వస్తా, సీఎం పోస్టు సంగతేందో తేలుస్తా.. కత్తిపూడి సభలో పవన్ క్లారిటీ
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి ఆయన ఈ యాత్ర ప్రారంభించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకర్గంలోని కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ వారాహి వాహనం పై నుంచి ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ వారాహి యాత్ర చేస్తున్నాడన్న విమర్శలను తిప్పికొట్టారు పవన్. తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడంలేదని జరుగుతున్న ప్రచారాన్ని కత్తిపూడి సభ ద్వారా ఖండించే ప్రయత్నం చేశారు.
“ఎంతసేపూ.. నువ్వు విడిగా రా.. నువ్వు విడిగా రా! అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకో లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను. కానీ, ఒక్క విషయం.. వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే.. పెడతాను. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం”అని సభా వేదిక నుంచి పవన్ తన మనసులో మాట చెప్పారు.