- కార్యకర్తలు అనవసర వివాదాలకు దిగవద్దు
- కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- నేను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదు
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసైనికులు, కూటమి నేతలకు కీలక సందేశం అందించారు. ‘ప్రియమైన సైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం’ అంటూ బహిరంగ లేఖ రాశారు.
‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకం. గత ఐదేళ్లుగా వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతిభద్రత వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు విసుగుచెంది మనకు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నాం.
ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్లు వేసి మౌలిక వసతులు కల్పన జరుగుతోంది.
5 కోట్ల మంది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు పాతికేళ్ల భవిష్యత్తును అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి.. వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఆశయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవద్దు లేదా కూటమి అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించవద్దు.
నేనెప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, ఇకపై అలాంటి రాజకీయాలు చేయను. నాకు తెలిసినది కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం, నేను పుట్టిన భూమిని అభివృద్ధి చేయడం మాత్రమే.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున.. పార్టీ భవిష్యత్తు లక్ష్యాలపై సమగ్రంగా చర్చిద్దాం’ అని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.