Wednesday, November 20, 2024

Janasena: వారాహి యాత్ర నేపథ్యంలో ధర్మపరిరక్షణ యాగం.. పాల్గొన్న జనసేనాని

మంగళగిరి..: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి వారాహితో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా ధర్మపరిరక్షణ యాగం చేశారు. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ గావించారు. సోమవారం ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు.

స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement